ఇన్నేళ్లు సీఎంగా.. ఇంత ప్రజాదరణ..

అవినీతి లేదు. బంధు ప్రీతి లేదు. సొంత రాజకీయం కోసం ప్రజాధనాన్ని పప్పు బెల్లం మాదిరిగా ఖర్చు పెట్టాలన్న యావ లేదు. క్యాబినెట్లో కొడుకు పెత్తనం లేదు.

అల్లుడు ఇష్టారాజ్యం లేదు. కూతురి దందాలు లేవు. ఉన్నదల్లా డాబూ దర్పం లేని వ్యక్తిత్వం.. ఓ తెల్ల లాల్చీ, ఒక సిగరెట్ ప్యాకెట్, కొంచెం మద్యం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సగటు ఒడిశావాసులకు పైవే గుర్తుకు వస్తాయి. అంతేకాదు సగటు ఒడిశావాసి మనసు గెలుచుకున్న ఆయన దేశంలోనే సుదీర్ఘకాలం కొనసాగిన రెండవ ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తిరగరాశారు. దేశంలోనే సుదీర్ఘకాలం పాటు, 24 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు అంటే 23 సంవత్సరాల 135 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

అవినీతి లేని పాలన

ఒడిశా ముఖ్యమంత్రిగా 2000 సంవత్సరం మార్చి 5న నవీన్ పట్నాయక్ మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై శనివారం నాటికి 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో, పవన్ కుమార్ చామ్లింగ్ తర్వాతి స్థానంలోకి వచ్చారు. పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతి బసు తర్వాత వరుసగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేతగానూ నవీన్ పట్నాయక్ మూడవ స్థానంలో నిలిచాడు. 2024 ఎన్నికల్లోనూ బిజూ జనతాదళ్ మళ్లీ విజయం సాధించి, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన పక్షంలో నవీన్ పట్నాయక్ దేశంలోనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా నిలుస్తారు.

ఎంతో ఉదారత

ప్రకృతి విపత్తులతో నిత్యం తల్లడిల్లే ఒడిశా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కే దక్కుతుంది. అవినీతి రహిత పాలన అందిస్తూ పేద రాష్ట్రమైన ఒడిశాకు నవీన్ పట్నాయక్ ఒక రూపు తీసుకొచ్చారు. అంతేకాదు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలోనూ, స్వదేశీ వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలోనూ పట్నాయక్ కీలక పాత్ర పోషించారు. ఎంతోమందిని చదివించారు. నవీన్ పట్నాయక్ చదివించిన వారిలో ఒక వ్యక్తి ఏకంగా ఫార్మా కంపెనీ అధిపతి అయ్యాడు. అతడు తన తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ.. నవీన్ పట్నాయక్ అండతో మెరుగైన చదువులు చదివాడు. ఏకంగా వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నాడు. ” నాకు సంబంధించిన అంతవరకు అందరూ చనిపోయారు. ఆ సమయంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాకు అండగా నిలిచారు. నేను ఇవ్వాళ ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి కారణం నవీన్ పట్నాయక్ మాత్రమే. అందుకే నేను ఆయనను నాన్న అని పిలుస్తాను” అని వ్యక్తి అన్నాడు అంటే నవీన్ పట్నాయక్ ఉదారతను అర్థం చేసుకోవచ్చు. కాగా నవీన్ పట్నాయక్ ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేయడం పట్ల ఒడిశా వాసులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :