ఇక దూకుడగా బీజేపీ: బండి సంజయ్‌కి ప్రత్యేక హెలికాప్టర్, 7న తెలంగాణకు ప్రధాని మోడీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త వెనుకబడినట్లు కనపిస్తున్న బీజేపీ.. మళ్లీ దూకుడును పెంచేందుకు సిద్ధమవుతోంది. వరుసగా అగ్రనేతల ప్రచార సభలతోపాటు రాష్ట్ర నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. నవంబర్ 7, 11 తేదీల్లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

 

Advertisement

7, 11 తేదీల్లో హైదరాబాద్ తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ రాష్ట్రానికి రానుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు, రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత నవంబర్ 15 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది.

 

నవంబర్ 19వ తేదీ తర్వాత మరోసారి ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి మూడు హెలికాప్టర్లు సమకూర్చింది. ఒకటి పూర్తిగా బండి సంజయ్‌కి కేటాయించగా.. మరో రెండు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఇతర ముఖ్య నేతల ప్రచారానికి వినియోగించనున్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా, బండి సంజయ్‌ బీజేపీ అధ్యక్షుడిగావైదొలిగిన నాటి నుంచి బీజేపీలో కొంత స్తబ్దత నెలకొన్న విషయం తెలిసిందే. పలువురు కీలక నేతలు కూడా పార్టీని వీడారు. ఈ క్రమంలో మరోసారి బండికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :