ఏపీలో పొత్తులపై తేల్చేసిన బీజేపీ?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ధృక్పథంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతోంది.

ఇందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకుంది. భారతీయ జనతాపార్టీని కూడా కలిసిరావాలని కోరుతోందికానీ ఆ పార్టీ అగ్రనాయకత్వం స్పందన ఏమిటనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సంక్రాంతికల్లా బీజేపీ నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంచనా వేస్తున్నారు.

ఈరోజు బీజేపీ జిల్లాల అధ్యక్షులు, పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఢిల్లీ నాయకత్వానికి అప్పగించారు. రేపు పార్టీ కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది. దీనికి పార్టీ నేత తరుణ్ ఛుగ్ హాజరు కానున్నారు. ఏపీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీద్వారా అడుగు పెడుతుండటంతో బీజేపీ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపడనివ్వకుండా చూడటానికి వ్యూహాలు రచిస్తోంది. పొత్తులపై పార్టీ నేతల అభిప్రాయాలను తరుణ్ ఛుగ్ సేకరించనున్నారు. జనసేనతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఇరుపార్టీలు సమైక్యంగా ఒక్క కార్యక్రమాన్నీ నిర్వహించకపోవడానికి కారణాలను కూడా ఆయన విశ్లేషించనున్నారు.

ఏపీలో పొత్తులతో వెళ్లాలా? లేదంటే ఒంటరిగా వెళ్లాలా? అన్న విషయంపై పార్టీ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి ఢిల్లీ నాయకత్వానికి తరుణ్ ఛుగ్ నివేదిక ఇవ్వనున్నారు. బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఆ పార్టీ ఉంది. అయితే పొత్తులవల్ల ఎవరికి లాభం? బీజేపీకి ఎంతవరకు మేలు కలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనే విషయాలను అంచనావేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొత్తుకు అగ్రనాయకత్వం సుముఖంగా లేకపోతే జనసేన వైఖరి ఎలా ఉండబోతోంది? అనే విషయాన్ని కూడా విశ్లేషించనున్నారు. తరుణ్ ఛుగ్ ఇచ్చే నివేదికను బట్టి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. అయితే చివరగా నరేంద్రమోడీ, అమిత్ షా నిర్ణయమే ఫైనల్ అవుతుంది. రానున్న రెండుమూడు రోజుల్లో పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :