దాదాపుగా కారు ‌‌‌‌‌ ఖాళీ..! భారీ కుదుపు, మరొకరు..?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.. తగులుతోంది కూడా. కారు నుంచి ఎవరు… ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ నుంచి గట్టిగా మాట్లాడిన నేతలు ఒకొక్కరు జారుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ ఏం జరుగుతుందోనన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. మిగతా నేతలు కూడా సర్దుకునే పనిలో పడినట్టు పొలిటికల్ సర్కిల్‌‌లో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చేనాటికి ఆ పార్టీ దాదాపు ఖాళీ కావడం ఖాయమని నేతలు చెప్పుకుంటున్నారు.

 

బీఆర్ఎస్‌కు కాలం కలిసి రాలేదా? పేరు మార్చిన ఆ పార్టీకి కష్టాలు రెట్టింపయ్యాయా? దశాబ్దంపాటు చక్రం తిప్పిన గులాబీ బాస్ పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఒకవైపు మద్యం కుంభకోణం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్, ఇంకోవైపు ప్రాజెక్టుల వ్యవహారం వంటి సమస్యలు చుట్టుముట్టేశాయి. ఈ క్రమంలో నేతలు తమకున్న పరిచయాలతో వలస పోతున్నారు. నేతలు జారుకోవడంతో కారు ఖాళీ అవుతోంది. ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు అధికార కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ జాబితా ఇంకా కంటిన్యూ అవుతోంది.

 

తాజాగా మాజీమంత్రి కడియం శ్రీహరి కూడా పార్టీ మారుబోతున్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులోభాగంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణ ఇన్‌ఛార్జ్ మున్షీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ తరపున వరంగల్ అభ్యర్థిగా కావ్య బరిలో నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాలం కలిసొస్తే కడియం శ్రీహరికి రేవంత్ మంత్రివర్గంలో ఛాన్స్ కల్పిస్తారనే ప్రచారం లేకపోలేదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

 

రాజకీయాల్లో సుధీర్ఘం అనుభవమున్న నేతల్లో కడియం శ్రీహరి కూడా ఒకరు. ఎన్టీఆర్ పిలుపుతో ఎంట్రీ ఇచ్చిన ఆయన వెనుదిరిగి చూడలేదు. దాదాపు నాలుగు కిందట రాజకీయాల్లోకి వచ్చిన కడియం, కలిసి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 30 ఏళ్ల కిందట స్టేషన్ ఘన్‌పూర్ నుంచి విజయం సాధించిన ఆయన.. తొలిసారి ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గం లోనూ కీలక బాధ్యతలు చేపట్టారు.

 

తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పేసి.. అప్పటి ఉద్యమ పార్టీలోకి చేరిపోయారు కడియం శ్రీహరి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఎంపీ పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. ఆ పార్టీలోని సీనియర్లు ఒకొక్కరుగా వెళ్లిపోవడంతో పలుమార్లు కార్యకర్తలతో చర్చించారు. చివరకు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :