రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూడాలి.. అధికారులను ఆదేశించిన సీఎం..

రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాగునీటి కొరతను అధిగమించాలని, వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యుత్, తాగునీటిపై శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా విద్యుత్‌ను అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

 

విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్ సరఫరా చేయటంతో కొత్త రికార్డు నమోదైందన్నారు. కోతలు లేకుండా విద్యుత్‌ను అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

 

రాష్ట్రంలో సగటున 9712 మెగావాట్ల విద్యుత్తు లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14000 మెగా వాట్ల నుంచి 15000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంది. ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు.

 

గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగిందని పేర్కొన్నారు. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల అత్యధిక సరఫరా రికార్డు నమోదైందని సీఎం స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే మూడు నెలలు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఉన్నచోట ఒక ప్రత్యేక అధికారని నియమించాలన్నారు. వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :