ట్రెండు మారింది.. వైసీపీ బెండు తీస్తారు : చంద్రబాబు..

మే 13న జరిగే ఎన్నికల్లో సైకో ఇంటికెళ్లడం, సైకిల్ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ను ఆయన కరకట్ట కమల్‌హాసన్ గా అభివర్ణించారు. జగన్ కు నీళ్ల విలువ తెలీదని, శ్రీశైలం ఎక్కడుందో కూడా అతనికి ఐడియా లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమకు నీళ్లిస్తే.. కోనసీమకంటే అందంగా తయారవుతుందన్నారు.

 

జగన్ కు ఏమీ తెలియకపోయినా.. అన్నీ తెలిసినట్లు నటిస్తాడన్నారు. జగన్ అధికారంలో ఉండగానే పరిశ్రమలు పారిపోయాయని, అదీ అతని బ్రాండ్ అని విమర్శించారు. “ఇప్పుడు ట్రెండ్ మారింది.. ప్రజలు వైసీపీ బెండు తీస్తారు” అని పేర్కొన్నారు. ప్రజల జీవితాలతో జగన్ మందు వ్యాపారం చేస్తుంటే.. వైసీపీ నేతలు గంజాయి అమ్మేవాళ్ల వద్ద డబ్బులు వసూలు చేసి వ్యాపారానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. అలాగే రాయలసీమను రతనాల సీమగా మార్చి.. రైతును రాజు చేయడమే తన సంకల్పమని తెలిపారు.

 

జగన్ కు రాయలసీమ అంటే హత్యా రాజకీయాలు మాత్రమేనని దుయ్యబట్టిన చంద్రబాబు.. టిడిపికి రాయలసీమ అంటే అభివృద్ధి అని తెలిపారు. ఉద్యోగాలు రావాలంటే చేయాల్సింది ప్రారంభోత్సవాలని, జగన్ కు ఇంతవరకూ శంకుస్థాపనలు చేయడానికే సరిపోయిందని విమర్శించారు. రాయలసీమకు తాము అధికారంలో ఉండగా కియా మోటార్స్ ను తీసుకురాగా.. ఇక్కడ తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయన్నారు. క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ నినాదంతో.. సైకో పాలనకు చరమగీతం పాడాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :