జగన్‌పై ఆగ్రహం.. అందుకే సీఎం కుర్చీ..!

ముఖ్యమంత్రి సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే వైసీపీని కచ్చితంగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. హంతకులకు కాపాడేందుకే సీఎం కుర్చీని జగన్ వాడుకుంటున్నారని ఘాటుగా విమర్శించా రు.

 

శుక్రవారం కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో బస్సుయాత్రను ప్రారంభించారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు.. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాను తీసుకొస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక బీజేపీకి దాసోహం అయ్యారని ధ్వజమెత్తారు. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేవని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ప్లాంట్‌పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.

 

ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని ఒక్కముక్కలో తేల్చేశారామె. వైఎస్ ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తి అయ్యేదన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి ఒకే ఒక కారణమన్నారు. వివేకాను హత్య చేయించిన వారికే మళ్లీ టికెట్ ఇవ్వడమే దీనికి కారణమన్నారు. ఒక విధంగా చెప్పాలంటే హంతకులను కాపాడేందుకు అధికారాన్ని వినియోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే భావించి తాను పోటీకి దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎవర్ని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించాలన్నారు వైఎస్ షర్మిల.

 

బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ జిల్లాలో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే యాత్ర సాగనుంది. శుక్రవారం రాత్రి వరకు కాశినాయన, కలసపాడు పోరుమామిళ్ల బి. కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో బస్సుయాత్ర సాగనుంది. శనివారం నుంచి ఈనెల 12 వరకు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వైఎస్ షర్మిలకు తోడు సునీత కూడా పాల్గొన్నారు.

 

మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. బస్సుయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృపారాణి.. జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ సొంతగూటికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :