బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసిన బీజేపీ

బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసిన బీజేపీ

వీసికే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్

కె.ఈశ్వర్ – రాయలసీమ బ్యూరో

భారతీయ జనతా పార్టీ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిందని వీసికే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని బ్యాంకులన్నీ కలిసి బీజేపీ ప్రభుత్వ పాలనలో 12 లక్షల కోట్ల రూపాయల నష్టాలు చవిచూడటం ఆందోళనకరమైన విషయమన్నారు.
2016లో చిన్న నోట్లు రద్దు చేసి 2,000 రూపాయల పెద్దనోటును ప్రవేశపెట్టిననాడే భారతీయ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం కుదేలయ్యాయన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను నిర్మూలించి ప్రైవేటు కంపెనీల ఇ-వ్యాలెట్ డిజిటల్ బ్యాంకింగ్ పెంపొందించేందుకు ఒక పథకం ప్రకారం బీజేపీ వ్యవహరించిందని ఆరోపించారు.గత 8 ఆర్థిక సంవత్సరాలలో బ్యాంకుల ఎన్.పి.ఎ.లు (నాన్ పర్ఫార్మింగ్ అసెట్ – నిరర్థక ఆస్తులు) 66.5 లక్షల కోట్ల రూపాయలు చేరుకోవడం, ధనిక వ్యాపారుల 14.5 లక్షల కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ (రద్దు) చేయడం బీజేపీ ధనిక వ్యాపారుల పార్టీ అని చెప్పేందుకు రుజువులన్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల పెట్టుబడులను అదానీ కంపెనీ వంటి ప్రైవేటు కంపెనీలలో పెట్టించడం ఇందుకు నిదర్శనమన్నారు.
బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, మెహుల్ చోక్స్కి వంటి అనేక బడా వ్యాపారస్తులలో అత్యధికులు గుజరాత్ వ్యాపారస్తులు కావడం గమనించదగ్గ అంశమన్నారు.
ఇటీవల సమాచార హక్కు చట్టం కింద ఓ సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2016 నుంచి ముద్రితమైన రు.500 నోట్లలో 88 వేల కోట్ల రూపా యలు లెక్కలోకి రాకుండా అదృశ్యమయ్యాయని వస్తున్న వార్తలు ఆందోళనలు కలిగిస్తున్నాయన్నారు.
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బకొట్టి ప్రైవేటు సంస్థల డిజిటల్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్న బీజేపీని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఓడించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను, భారతీయ ఆర్ధిక వ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ మతం, కులం, ప్రాంతం, భాష, సంస్కృతుల ముసుగులో కొనసాగిస్తున్న విద్వేష రాజకీయాలను, ఆర్ధిక దోపిడీని ప్రజలు గుర్తించి ఆ పార్టీకి సరైన గుణపాఠం నేర్పించాలని శివ ప్రసాద్ పిలుపునిచ్చారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :