నిర్వాసితుల సమస్యలపై పోలవరం పోరుకేక

నిర్వాసితుల సమస్యలపై పోలవరం పోరుకేక

సిపిఎంచే పోస్టర్ల ఆవిష్కరణ

కె.ఈశ్వర్ – రాయలసీమ బ్యూరో

పోలవరం ప్రాజెక్టులో ముంపుప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని, పనులను తక్షణం పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఆదివారం సిపిఎం కార్యాలయంలో నిర్వాసితుల సమస్యలపై పోలవరం పోలి కేక పోస్టర్లను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం పనుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పోలవరంలో లక్షలాది మంది నిర్వాసితుల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో పోలవరం పోరుకేక పేరుతో భారీ పాదయాత్రను చేపట్టనునుట్లు తెలిపారు. ఈ నెల 20న భధ్రాచలం దగ్గరున్న ఎటపాక నుంచి మొదలై 15 రోజులపాటు ముంపు ప్రాంతాల్లో కొనసాగి జూలై 4న విజయవాడకు పాదయాత్ర చేరుకుంటుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం బాధ్యతారహితంగా మాట్లాడుతోందని విమర్శించారు. ఏ ప్రాజెక్టు పరిధిలోనైనా పునరావాసం పూర్తి చేశాకే ప్రాజెక్టు పనులు ముందుకువెళ్లాలనేది అంతర్జాతీయంగా ఉన్న సూత్రమని అయితే పోలవరంలో నిర్వాసితులను గాలికి వదిలేసి ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం లైడార్‌ సర్వేతో మరో 36 గ్రామాలను అదనంగా చేర్చింది తప్ప పూర్తి స్థాయి ముంపు తేల్చలేకపోయిందని, 2022 జూలైలో వచ్చిన వరదలకు193 గ్రామాలు ముంపుకు గురయ్యాయని తెలిపారు. చింతూరు, కూనవరం మండలాల్లో మొత్తం ముంపునకుగురైతే కూనవరంలో ఒక గ్రామం మాత్రమే ముంపునకు గురైందని ప్రభుత్వం చెప్పడం అవాస్తవమని అన్నారు. పునరావాసం కోసం ప్రభుత్వం నిర్మించిన గ్రామాలు కూడా ముంపునకు గురయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పునరావాస పనుల్లో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని తెలిపారు. డయాఫ్రంవాల్‌ డ్యామేజిపై ప్రభుత్వం రాజకీయంగా మాట్లాడటం ఆపి జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముంపు ప్రాంతాల లైడార్‌ సర్వేను ఆకాశం నుండి కాకుండా నిర్దిష్టంగా 1986, 2022 వరదలను ప్రామాణికంగా తీసుకొని సమగ్ర సర్వే చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో పునరావాసం పనులు కేంద్రానికి సంబంధం లేదనడం తగదని అన్నారు. పోలవరం పునరావాసం కోసం రూ 32 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.7వేల కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను చెప్పాలని, సందర్శనకు అఖిపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్‌షా పోలవరం ప్రాజెక్టు నిధులపై ఒక్క మాట మాట్లాడకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో అసలైన నిర్వాసితుల సమస్యను పక్కదారి పట్టించేలా అధికార, ప్రతిపక్షం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. కేవలం కాంట్రాక్లర్ల ప్రయోజనాల కోసం తగువులాడుతున్నారు తప్ప పునరావాస బాధితులకు న్యాయం చేయాలనే అంశాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ప్రకారం ఆదివాసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పునరావాస చర్యలను చేపట్టాలని కోరారు. కేంద్రం ఇపుడు ఇస్తున్న రూ 12వేల కోట్లను పునరావాసం కోసం ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యను అజెండా చేసేందుకు ఈ పాదయాత్రను చేపట్టామని తెలిపారు. పోలవరం పోరుకేక పాదయాత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయానికి గురవుతున్న ముంపు గ్రామాల ప్రజల కోసం చేపట్టిన ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్ రెడ్డి, నాయకులు వెంకటేష్, సురేంద్ర, నాగరాజు, రామకృష్ణ, పవన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :