రంగు మారింది.. పిట్ట ఎగిరిపోయింది

శీర్షిక చూసి..ఇదేంటి బేతాళ కథ పుస్తకంలో వాక్యం లాగా ఉంది అనుకుంటున్నారా? కాదే కాదు. ఇప్పుడు అసలే సోషల్ మీడియా రోజుల కాబట్టి బేతాళ కథ లాంటి పుస్తకాన్ని చదివే తీరిక ఎవరికీ లేదు.

ఇప్పుడు అన్ని మైక్రో బ్లాగింగ్ రోజులు. అంటే ఏదైనా సూటిగా, సుత్తి లేకుండా ఉండాలి. ఇలా సూటిగా ఉంది కనుకే ట్విట్టర్ పిట్ట సూపర్ హిట్ అయింది. 200 కోట్ల డౌన్లోడ్స్ తో తిరుగులేని స్థానం సంపాదించుకుంది. మిగతా యాప్స్ విభాగంలో కొత్త కొత్తవి పుట్టుకొచ్చినప్పటికీ.. మైక్రో బ్లాగింగ్ విషయంలో ట్విట్టర్ ను బీట్ చేసే యాప్ రాలేదు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ యాప్ ను విరివిగా వాడుతుండడంతో ఇది అత్యవసరమైన సమాచార సాధనంగా మారిపోయింది. ఇదంతా ఒక వైపు మాత్రమే. ట్విట్టర్ కు సంబంధించి రకరకాల వివాదాలు కూడా ఉన్నాయి. మొదట దీనిని తయారుచేసిన సంస్థ ఎలన్ మస్క్ కు విక్రయించింది. ఆ తర్వాత దాంతో ఆయన రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు.

పిట్ట తీసివేసి..

ట్విట్టర్ కు దాని సింబాలిక్ ఐకాన్ పిట్ట. నీలి రంగులో ఉండే ఆ పిట్ట ట్విట్టర్ కు తిరుగులేని స్థానాన్ని అందించింది. ట్విట్టర్ అంటే ఇంగ్లీషులో వాగుడుకాయ అని అర్థం. దాన్ని ప్రతిబింబించే విధంగానే పిట్టను లోగో లాగా వాడారు. ట్విట్టర్ చేతులు మారిన నేపథ్యంలో ఇన్నాళ్ళ వరకు ఆ పిట్ట లోగో లాగా ఉండేది. ఇకపై అది కనిపించదు. ఎందుకంటే ఆ లోగోను తీసివేసి ఎక్స్ అనే అక్షరాన్ని లోగోగా పెడతానని ఎలన్ మస్క్ ప్రకటించాడు. త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్ కు, అన్ని పక్షులకూ వీడ్కోలు పలుకుతామని వివరించారు. మంచి ఎక్స్ లోగోను రూపొందించగలిగితే దాన్ని ఆదివారం రాత్రికి పోస్ట్ చేసి సోమవారం నుంచి ప్రపంచమంతా లైవ్ లోకి తెస్తామని వెల్లడించాడు. అంతేకాదు తన ఎక్స్ హోల్డింగ్స్ కార్పొరేషన్ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మస్క్ ఒక కొత్త కంపెనీ స్థాపించాడు. ఎక్స్ అనే దాన్ని కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎవ్రీథింగ్ యాప్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా ట్విట్టర్ ప్లాట్ ఫామ్ నకు సంబంధించిన రంగును నీలం నుంచి నలుపుకు మార్చే ఆలోచనలో మస్క్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన నిర్వహించిన ఆన్లైన్ పోల్ కు గంట వ్యవధిలో 2.24 లక్షల మంది స్పందించారు. వారిలో 76.3% మంది రంగు మార్పుపై సానుకూలంగా స్పందించారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :