బీజేపీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు…

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్నప్పటికీ రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో బాపూరావుకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

 

Advertisement

2018 ఎన్నికల్లో బోథ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాథోడ్ బాపురావుకు ఈసారి బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే బాపురావు బుధవారం బీజేపీలో చేరారు. మరోవైపు, బీజేపీకి రాజీనామా చేశారు కీలక నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేక్ బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉండటం గమనార్హం.

 

బీజేపీ మూడో జాబితా కసరత్తు పూర్తి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థుల తుది జాబితాను బుధవారం సాయంత్రం లేదా గురువారం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే రెండు విడతల్లో 53 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షం జనసేనకు సీట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తోంది.

 

నియోజకవర్గాలవారీగా ఆశావహులు, వారి బలాబలాలు, సామాజిక సమీకరణాలపై ఓ నిర్ణయానికి వచ్చి నియోజకవర్గానికి రెండు, మూడు పేర్లతో ఒక జాబితాను రూపొందించారు. అయితే జనసేన 26 స్థానాలు కోరుతున్న విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

 

ఈ క్రమంలో తెలంగాణలో ఆ పార్టీ బలం ఆధారంగా.. జనసేనకు 10 స్థానాల వరకు ఇవ్వాలని బీజేపీ నేతలు సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు బుధవారం సాయంత్రం సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయనుంది. బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం తుది జాబితాను విడుదల చేయనున్నారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :